గుడివాడలో పెట్రోల్ బంకను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని
తెలుగు తేజం, గుడివాడ : వినియోగదారులకు నాణ్యమైన పెట్రో ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సూచించారు. బుధవారం స్థానిక గుడివాడ-కంకిపాడు ప్రధాన రహదారిలోని డీమార్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన మోహన పాండురంగా ఫిల్లింగ్ స్టేషను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీజిల్ డిస్పెన్సర్‌ను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని తొలిగా తన వాహనానికి డీజిల్ ను ఫిల్ చేసిన మొత్తానికి సంబంధించిన నగదును అందజేశారు. అలాగే మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ పెట్రోల్ డిస్పెన్సర్ ను ప్రారంభించి, బుల్లెట్ వాహనానికి పెట్రోల్ ఫిల్ చేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ లాభదాయకమైన వ్యాపారాల్లో పెట్రోల్ బంక్ ల నిర్వహణ ఒకటని అన్నారు. ఈ వ్యాపారంలో నాణ్యమైన పెట్రోల్, డీజిల్, సంబంధిత ఉత్పత్తులను మాత్రమే విక్రయించడం ముఖ్యమన్నారు.ఇటీవల కాలంలో పెట్రోల్ బంక్ లంటే కల్తీ జరుగుతుందనే ప్రచారం ఉందన్నారు. దీనికి భిన్నంగా వినియోగదారుల మన్ననలు పొందేలా వ్యాపారాన్ని నిర్వహించాలని నిర్వాహకులు పాలేటి చంటి, పాలేటి శివచైతన్య, చింతా వెంకటరత్న వంశీకృష్ణలకు సూచించారు.
బంక్ ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించాలన్నారు. కంపెనీ నుండి వచ్చే పెట్రో ఉత్పత్తులు తిరిగి వినియోగదారులకు విక్రయించే వరకు ప్రతి విషయాన్నీ ఎంతో జాగ్రత్తగా, ఎటువంటి అక్రమాలకు తావులేని విధంగా నిర్వాహకులే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాపారంలో కూడా పాలేటి చంటి, పాలేటి శివచైతన్య, చింతా వెంకటరత్న వంశీకృష్ణలు రాణించాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్ది మాట్లాడుతూ విజయవాడ నుండి గుడివాడ వైపు, విజయవాడకు వెళ్ళే వాహనదారులకు ఈ పెట్రోల్ బంక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్నివేళల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచుతూ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ వ్యాపారాన్ని లాభదాయకంగా నిర్వహించాలని నిర్వాహకులను అడపా బాబ్ది కోరారు. అనంతరం మంత్రి కొడాలి నానిని నిర్వాహకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ సతీష్, ప్రముఖులు శివశంకర్, నాగభూషణరావు, వెంకట్రావు, రాఘవ, హనుమంతరావు, రాంప్రసాద్, సుధాకర్, శ్రీను, వెంకట కృష్ణారావు, శిష్టా దత్తాత్రేయులు, ప్రసాదరావు, రామ్మోహన్, అప్పారావు, వాసుదేవరావు,
ప్రబోధారాణి, బాజీ, జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.