తెలుగు తేజం, విజయవాడ : కృష్ణానది తీరాన సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శ్రీ ప్రత్యేక శనైశ్చర స్వామి వారి ఆలయంలో స్వామి వారి జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అష్టోత్తర శతకలశ అర్చన, అభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ఆలయంలో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ మంటపారాధన, కలశస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా 108 కలశాల ఆవాహన ఏకాదశ రుద్ర అభిషేకాల, పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అలాగే ఉభయదాతలతో కలశ పూజలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం స్వామి వారికి ప్రత్యేక అలంకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైధిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్ఛకులు శ్రీమన్నారాయణ నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి గెల్లి హరిగోపీనా«ద్బాబు పర్యవేక్షించారు.