నూజివీడు : నూజివీడు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న సభాస్థలి ప్రాంగణాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నిర్వహించే సభ వేదిక ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో సీఎం సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ముందుగా హనుమాన్ జంక్షన్ రోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చేందుకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన చేశారు. మార్కెట్ యార్డ్ ప్రాంతం తో పాటు మరొక ప్రాంతాన్ని పరిశీలించాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. తిరువూరు రోడ్డులో ఉన్న ఎంఐజి ప్లాట్స్ వద్ద ప్రదేశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సభా ప్రాంగణాన్ని కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ఉంచాలని సూచించారు. నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు తో అధికారులు చర్చించి సీఎం పాల్గొని సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డి.ఎస్.పి ఈ అశోక్ కుమార్ గౌడ్, నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.