ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందనున్నట్లు చెప్పారు. కాసేపటి, క్రితం ఓ ట్వీట్ చేసిన సచిన్.. తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు, వారు చూపిస్తున్న ప్రేమా ఆప్యాయతలకు ధన్యవాదాలు చెప్పారు. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తానన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు 2011లో టీమ్ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి నేటికి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో సచిన్.. దేశ ప్రజలకు, తన సహచరులకు శుభాకాంక్షలు చెప్పారు.
కాగా, మార్చి 27న తాను కరోనా బారిన పడినట్లు సచిన్ స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని.. దాంతో పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. అప్పుడు తన కుటుంబసభ్యులకు నెగెటివ్ వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు తొలుత హోమ్ క్వారంటైన్లో ఉన్న ఆయన ఇప్పుడు ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు వారం రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌లో సచిన్ ఇండియా లెజెండ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అదే టోర్నీలో ఆడిన యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ సైతం వైరస్ బారిన పడ్డారు. వారిద్దరూ ఇప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.