శిబిరాన్ని సందర్శించిన పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు
కన్నెబోయిన రామలక్ష్మి ప్రసాద్
తెలుగు తేజం, జగ్గయ్యపేట :రైతులను వంచించిన ఘనత రాష్ట్రంలోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి ప్రసాద్ ధ్వజ మెత్తారు. ఆమె బుధవారం రాజధాని ప్రాంతంలో మందడం, కృష్ణయ్య పాలెం, తుళ్లూరు, పెద్ద పరిమి తదితర గ్రామాల్లో రైతులు రాజధాని కి మద్దతుగా నిర్వహిస్తున్న 351 వ రోజు దీక్ష శిబిరాన్ని రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, విజయవాడ పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం గార్ల ఆదేశాలతో సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసేందుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని ఉండకూడదన్న లక్ష్యంతో మూడు రాజధానులు విభజించి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. రైతులు చేస్తున్న పోరాటం చరిత్రలో నిలిచిపో తుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్రహీనం గా నిలుస్తుందని ఆమె అన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు పోటీగా ప్రభుత్వం పెయిడ్ వర్కర్స్ తో పోటి ఆందోళన చేపించటం దివాళాకోరుతనం అని విమర్శించారు. త్వరలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వానికి రాజధాని విషయంలో ఎదురుదెబ్బ తప్పదని రైతులంతా మనోధైర్యంతో ఉండాలని ఆమె కోరారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగిలి తీరుతుందని ఆమె అన్నారు. ఆమె వెంట నియోజకవర్గ తెలుగు మహిళ నాయకురాలు గుగులోతుర రమాదేవి ఉన్నారు.