అమరావతి: హెరాయిన్ విషయంలో ఏపీ పాత్ర ఉందని దుష్ర్పచారం జరుగుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టుబడిన హెరాయిన్‌కు ఏపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దీనిపై డీఆర్ఐ నార్కోటెక్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. విజయవాడను ట్రాన్స్‌ఫోర్ట్ అడ్రస్‌గా మాత్రమే వాడుకున్నారని గుర్తుచేశారు.
చెన్నై కేంద్రంగానే మొత్తం లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. హెరాయిన్ విషయంలో రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం ఆఫీసు పక్కన ఇదంతా జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతాభావంలోకి నెడుతున్నారని వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. అసాంఘిక కార్యకలాపాలకు రాష్ట్రంలో చోటు లేదని తేల్చిచెప్పారు. హెరాయిన్ కేసులో దర్యాప్తు బృందాలకు తాము పూర్తి సహకారం అందిస్తామని డీజీపీ పేర్కొన్నారు