తెలుగు తేజం, గుడివాడ : ఆపదలో ఉన్నవారికి 104, 108 సర్వీస్ ద్వారా అత్యాధునిక వైద్యసే సేవలు
అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గురువారం స్థానిక రాజేంద్రనగర్‌లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ జిల్లా మేనేజర్ ఎస్ సురేష్ కుమార్, 108 డివిజన్ సూపర్వైజర్ కే దుర్గాప్రసాద్, 104 సూపర్ వైజర్ ఎస్ ఫ్రాన్సిస్, ఎమినిటీ సిబ్బంది వీ సత్యనారాయణ, ఈ బాలమ్మ,
కేవీడి భవాని, పీ వెంకటస్వామి, పైలెట్స్ పీ శ్రీనివాసరావు, సీహెచ్ సుబ్బారావు, కే సుధీర్ కుమార్, వీ సుమన్, వీ శ్యామ్, బాలకిరణ్, సీహెచ్ ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ తదితరుల కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104, 108 అంబులెన్స్ సర్వీస్‌లకు సంబంధించి ప్రతి నెలా హైదరాబాద్ నుండి
మందులు వస్తుంటాయన్నారు. వీటిని గుడివాడ డివిజన్ పరిధిలో ఉన్న అంబులెన్స్ కు సరఫరా చేస్తుంటామన్నారు. అయితే ఈ మందులను నిల్వచేసేందుకు, సిబ్బంది పనిచేసుకునేందుకు గుడివాడ
ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ఒక డివిజన్ కార్యాలయాన్ని కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి కొడాలి
నాని మాట్లాడుతూ గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో 108 సేవలను అందించే సిబ్బంది కోసం ప్రత్యేక డివిజన్ కార్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా గత జూలై 1 వ తేదీన సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో 104, 108 సర్వీస్ ను అందించేందుకు 1,088 అంబులెన్స్ లను ప్రారంభించారన్నారు. ఈ అంబులెన్స్ లో పలాక్సీమీటర్, మల్టీపారా మానిటర్, ట్రాన్స్ పోర్ట్ వెంటిలేటర్, సక్షన్ ఆపరేటర్, ఫోల్డబుల్ స్ట్రెచర్స్ సిరంజ్, పంపు తదితర అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే 104 సర్వీస్ ద్వారా 74 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. వీటితో పాటు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన నియోనేటల్ అంబులెన్స్ లు ఐదేళ్ళ లోపు చిన్నారులకు
వైద్య సేవలను అందిస్తున్నాయని మంత్రి కొడాలి నాని చెప్పారు.