న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెగెటివ్ జోన్లో లేదా జీరోకు చేరువగా ఉండవచ్చన్నారు. తొలి త్రైమాసంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం మేర దెబ్బతినడమే దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ ఫోరం కార్యక్రమంలో మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల జీవనోపాధి కంటే వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం మార్చి 25 నుంచి కఠిన లాక్డౌన్ను అమలు చేసిందని గుర్తుచేశారు.
అన్లాక్ తర్వాత దేశంలో స్థూల ఆర్థిక ప్రమాణాలన్నీ రికవరీ సంకేతాలను చూపాయని పేర్కొన్నారు. పండుగ సీజన్ ఆర్థిక వ్యవస్థలో మరింత జోరు పెంచి మూడు, నాలుగో త్రైమాసికాల్లో సానుకూల వృద్ధిపై ఆశలు పెంచిందని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధి రేటు ఊపందుకుంటుందని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు ముమ్మరమయ్యేలా ప్రభుత్వ వ్యయం పెంచడంపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు.