Breaking News

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9: దేశ రాజధాని ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు శనివారం ప్రారంభమైంది. సభ్య దేశాలు పలు కీలక అంశాలపై చర్చించాయి. అభివృద్ధి, భౌగోళిక రాజకీయ అంశాలపై రూపొందించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌’కు సభ్యదేశాలు ఏకాభిప్రాయడంతో ఆమోదం తెలుపడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. తీర్మానం ఆమోదం పొందినట్టు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది జీ20 కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్‌కు ముఖ్యమైన విజయమని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాల నేపథ్యంలో డిక్లరేషన్‌ ఆమోదం పొందడం గమనార్హం. 37 పేజీలతో రూపొందించిన ఈ తీర్మానంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంశాన్ని నాలుగుసార్లు ప్రస్తావించారు. అణు బెదిరింపులు ఆమోదనీయం కాదన్న అంశంపై అన్ని సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాగా, యుద్ధం అంశం డిక్లరేషన్‌ ఆమోదానికి ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉన్నదని అంతకుముందు భావించారు.

ఇది యుద్ధాల శకం కారాదు..
ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని తీర్మానం పిలుపునిచ్చింది. నేటి కాలం యుద్ధాల శకం కాకూడదని పేర్కొన్నది. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను కట్టుబడి ఉండాలని, దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను గౌరవించాలని స్పష్టం చేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని నివారించాల్సిందేనని నేతలు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఏర్పడిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు బలమైన, సుస్థిరమైన, సమగ్రమైన వృద్ధి సాధించడమే సమాధానమని అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా విశ్వాస రాహిత్యం
ప్రధాని మోదీ సదస్సును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. ముందుగా మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. కొవిడ్‌-19 సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘విశ్వాస లోటు’ ఏర్పడిందని, యుద్ధాలు దాన్ని మరింత పెంచాయని అభిప్రాయపడ్డారు. అందరం కలిసి నమ్మకం, విశ్వాసం నెలకొల్పుదామని పిలుపునిచ్చారు. పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధన నిర్వహణ, ఆరోగ్యం, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమాధానం కోసం కలిసికట్టుగా ముందుకు పోవాలని మోదీ అన్నారు.

జీ20 ఇక జీ21!
జీ20 కూటమి ప్రారంభించిన తర్వాత ఢిల్లీ వేదికగా తొలిసారిగా విస్తరించారు. కొత్తగా ఆఫ్రికన్‌ యూనియన్‌(ఏయూ)కు కూటమిలో సభ్యత్వం కల్పించారు. ఈ మేరకు భారత్‌ చేసిన ప్రతిపాదనకు సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి.ఏయూ చేరిక నేపథ్యంలో జీ20 పేరును జీ21గా మార్చడంపై ఆదివారం ప్రకటించే అవకాశం ఉన్నది. పర్యావరణం, వాతావరణం పరిశీలన కోసం జీ20 శాటిలైట్‌ మిషన్‌ను ప్రారంభించాలని సదస్సులో భారత్‌ ప్రతిపాదించింది. ప్రపంచ జీవ ఇంధనాల(గ్లోబల్‌ బయో ఫ్యూయల్స్‌) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో చేరాలని జీ 20 సభ్య దేశాలన్నింటికీ ప్రధాని మోదీ కోరారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే శాతాన్ని 20కి చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

చైనాకు కౌంటర్‌గా కొత్త కనెక్టివిటీ కారిడార్‌
వ్యాపార సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ‘భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌’ కనెక్టివిటీ కారిడార్‌ ప్రణాళికలను నేతలు జీ20 సమావేశాల సందర్భంగా ఆవిష్కరించారు. భారత్‌ నుంచి మధ్యప్రాచ్య దేశాల మీదుగా, యూరప్‌ వరకు విస్తరించి ఉండే ఈ కారిడార్‌ చైనా ‘వన్‌ బెల్ట్‌-వన్‌ రోడ్‌’కు కౌంటర్‌గా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారిడార్‌ కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధికి కొత్త దశ ఇస్తుందని మోదీ పేర్కొన్నారు. ‘భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌’ కనెక్టివిటీ కారిడార్‌ లాంచింగ్‌ అనేది చారిత్రాత్మక ఒప్పందం అని అభిప్రాయపడ్డారు. రాబోవు రోజుల్లో ఇది భారత్‌, పశ్చిమ అసియా, యూరప్‌ దేశాల మధ్య ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా ఉంటుందని అన్నారు.

మోదీ ముందు ‘భారత్‌’ నేమ్‌ప్లేట్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును మార్చనున్నదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందుకు మరింత బలం చేకూర్చే పరిణామం జీ20 సమావేశాల్లో చోటుచేసుకొన్నది. ప్రధాని మోదీని ‘భారత్‌’ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నేతగా పేర్కొంటూ సమావేశాల్లో ఆయన ముందు ‘భారత్‌’ అని రాసివున్న నేమ్‌ ప్లేట్‌ను ఉన్నది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *