Breaking News

కరోనా: ఆ 3 రాష్ట్రాల్లోనే.. లక్ష కేసులు

దిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ దేశం మరోసారి చిగురుటాకులా వణుకుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవడం కొవిడ్‌ తీవ్రతను కళ్లకు కడుతోంది. తొలుత ఈ రెండో దశ ఉద్ధృతి మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు చాపకింద నీరులా దేశమంతా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ మొత్తం కేసుల్లో సగం.. కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదవుతుండటం గమనార్హం. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలో రికార్థు స్థాయిలో లక్షకు పైగా కేసులు బయటపడుతున్నాయి.

24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 2,17,353 కొత్త కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 61,695, ఉత్తరప్రదేశ్‌లో 22,339, దిల్లీలో 16,699 కేసులు నమోదయ్యాయి. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వైరస్‌ ఉగ్రరూపం చూపిస్తోంది. రోజువారీ కేసుల్లో 80శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

16 రాష్ట్రాల్లో కేసులు పైపైకి..

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, దిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, రాజస్థాన్‌, పంజాబ్‌, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్‌లో రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో క్రియాశీల కేసులు 15 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,69,743 యాక్టివ్‌ కేసులున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే క్రియాశీల కేసులు 97 వేలకు పైగా పెరగడం ఆందోళనకరం. ఇందులో 40 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళలోనూ అత్యధిక స్థాయిలో యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *