వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తొలి నుంచి ట్రంప్ పాపులర్ ఓట్లలో ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ.. విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో మాత్రం బైడెన్ ముందంజలో ఉన్నారు. అయితే, కీలక రాష్ట్రాలుగా భావిస్తున్న ఫ్లోరిడా, జార్జియాలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా అతిస్వల్పంగా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పాపులర్ ఓట్లలో మాత్రం ట్రంప్ 50.13 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. బైడెన్ 48.33 శాతం ఓట్లు సాధించారు.