కంచికచర్ల : కొడుకు ప్రమాదవశాత్తు మునీరు నీటిలో పడి మృతి చెందగా, చేతికందివచ్చిన చెట్టంత కొడుకు మృతి చెందడాన్ని తట్టుకోలేక అతని కన్నతల్లి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో జరిగింది. కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామానికి చెందిన కొంగర నాగరాజు (42) ప్రమాదవశాత్తు మునేటిలో మునిగి మృతి చెందాడు. ఏటూరు గ్రామంలో ఒక వివాహానికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం ఇంటి నుండి బయలుదేరి బయటకు వెళ్లిన నాగరాజు కనిపించకుండా పోయాడు. సెల్ ఫోన్ కూడా పని చేయకపోవటంతో అనుమానం వచ్చిన నాగరాజు భార్య ముకుంద భర్త కనిపించడం లేదని కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతికారు. మున్నలూరు వద్ద మున్నేరు దాటి ఏటూరు వెళ్లేందుకు దగ్గర దారి కావడంతో ఆ ప్రాంత ప్రజలు మునేరు గుండా రాకపోకలు కొనసాగిస్తున్నారు. నాగరాజు కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు అతని బైక్ మునేటి సమీపంలో ఉండటం కనిపించింది. నాగరాజు మృతదేహం మున్నలూరు వద్ద మునేటిలో శుక్రవారం ఉదయం తెలియాడుతుండటం గమనించిన గ్రామస్తులు శవాన్ని మునేటి నుండి వెలికితీశారు. మునేరుకు గత కొద్ది రోజులుగా వరదరావడంతో లోతుగా ఉన్న నీటిలో దిగటంతో ఊపిరాడక నాగరాజు మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. వ్యవసాయ పనులు చేస్తూ జీవనాధారం కొనసాగిస్తున్న మృతుడు నాగరాజుకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మునేటి నీటిలో పడి మృతి చెందాడన్న వార్తతో మునులూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతి కంది వచ్చిన చెట్టంత కొడుకు అకస్మాత్తుగా మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు గుండెలవిశేలా విలపించారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక రోధించిన తల్లి నరసమ్మ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందింది. తల్లి కొడుకుల ఆకస్మిక మరణంతో మున్నలూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు పంచనమా నిర్వహించి నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ తరలించారు.