- పలువురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు
- దక్షిణ భారత అడ్వకేట్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన హైకోర్టు చీఫ్ జస్టిస్
తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం:
క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం అలవడుతుందని పలువురు హైకోర్టు న్యాయమూర్తులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దక్షిణ భారత న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ మూలపాడు క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు. తొలుత టోర్నమెంట్ లో పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం జస్టిస్ అరూప్ కుమార్ బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆటలో ప్రావీణ్యం కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులు నిత్యం పని ఒత్తిడిలో ఉంటారని, వారికి మానసిక ప్రశాంతతో పాటు ఉత్సాహంగా ఉండేందుకు ఆటలు ఉపయోగపడతాయన్నారు. ఏఏఏసీటీ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ పొన్నూరి సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు,జస్టిస్ కె.లలిత కుమారి, హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ లను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంటా రామారావు, ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శరత్ చంద్రారెడ్డి, ఏఏసీటీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ చలసాని అజయ్ కుమార్, వైస్ చైర్మన్లు జి.శ్రీనివాసులు రెడ్డి, పి.వెంకట రెడ్డి, పి.బాజీ షరీఫా ఖాన్,ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపినాధ్ రెడ్డి, ,ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మీడియా మేనేజర్ సి ఆర్ మోహన్ చౌదరి పాల్గొన్నారు.