Breaking News

చంద్రబాబుకు సంబంధించి కోర్టు జారీ చేసిన అన్ని ఆదేశాలు అమలు చేస్తున్నాం :

జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌ గుప్తా

రాజమండ్రి: స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోని స్నేహ బ్లాక్‌లో ఉన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన అనంతరం అధికారులు అక్కడ భద్రత పెంచారు. బయట ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ఒక సహయకారి కూడా ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు 4+1 భధ్రత కల్పించారు. మాజీ సీఎం కావడంతో 24 గంటలపాటు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే, రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ప్రభుత్వ, భద్రతా వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు భద్రతపై సందేహాలు వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో.. అలాంటిదేమి లేదని చెప్తూ ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ కార్యదర్శి, ప్రస్తుతం జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఉన్న హరీష్‌ గుప్తా అడ్వకేట్‌ జనరల్‌కు లేఖ రాశారు. చంద్రబాబుకు సంబంధించి కోర్టు జారీ చేసిన అన్ని ఆదేశాలు అమలు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు కోసం ప్రత్యేకంగా ఒక వార్డు కేటాయించామని, ఆయన ఉన్న వార్డు వైపు ఎవరిని అనుమతించడం లేదని పేర్కొంటూ రెండు పేజీలు లేఖ రాశారు. దీనిలో చంద్రబాబు కోసం తీసుకున్న భద్రతా పరమైన అన్ని అంశాల గురించి ప్రస్తావించారు. నిన్న కుటుంబ సభ్యుల పరామర్శ అనంతరం చంద్రబాబు నాయుడు రాత్రి 9:30కి పడుకున్నారు. ఉదయం 4:30, 5 మధ్యలో నిద్రలేచారు. మూడో రోజు బుధవారం ఉదయం కాసేపు వాకింగ్ చేసి అనంతరం మెడిటేషన్ చేశారు. బ్లాక్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్స్ చదివారు. చంద్రబాబుకు తీసుకొచ్చే ఆహారాన్ని ప్రతిరోజు సెంట్రల్ జైల్ లోపల గేటు వద్ద చెక్ చేస్తున్నారు జైలు అధికారులు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *