మిలన్: ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. బ్రిటన్లో అత్యధిక మంది మహమ్మారి ప్రభావానికి గురి కాగా.. ఇటలీ తర్వాతి స్థానంలో ఉంది. తొలి దశలో కరోనా విజృంభణతో ఇటలీ చిగురుటాకులా వణికిపోయింది. దీంతో కఠిన ఆంక్షలు విధించి అదుపులోకి తీసుకొచ్చింది. రెండోసారి వ్యాప్తి తీవ్రమవుతుండడంతో ఆంక్షలతో పాటు మరిన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా త్వరలో అందుబాటులోకి రాబోతున్న ఫైజర్ టీకా కొనుగోలుపై దృష్టి సారించింది.
కరోనా సోకే ముప్పు అధికంగా ఉన్న అందరికీ జనవరి చివరికల్లా టీకా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 1.6 మిలియన్ల మందికి సరిపడా 3.4 మిలియన్ల డోసుల ఫైజర్ టీకా జనవరి రెండో వారంలో ఇటలీకి అందనుందని ఆ దేశ వైరస్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం కమిషనర్ డొమెనికో అర్క్యూరీ తెలిపారు. 2021, సెప్టెంబరు నాటికి దేశ జనాభాలో అత్యధిక మందికి టీకా అందజేస్తామన్నారు. వృద్ధులు, వైద్య సిబ్బంది సహా వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు.
ఫైజర్ సహా ఇతర వ్యాక్సిన్ల వినియోగానికీ ‘యురోపియన్ మెడికల్ ఏజెన్సీ’ సరైన సమయంలో అనుమతిస్తుందని తాము భావిస్తున్నామని అర్క్యూరీ తెలిపారు. తద్వారా టీకా జనవరిలోనే అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఆసక్తిగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. 2021 తొలి అర్ధభాగం లేదా మూడో త్రైమాసిక చివరి నాటికి దాదాపు అందరికీ వ్యాక్సిన్ అందుతుందని అంచనా వేశారు. ఈ మేరకు కావాల్సిన సూదులు, సిరంజిలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటలీలో ఇప్పటి వరకు 1,308,528 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో 47,870 మంది మృతిచెందారు.