తెలుగు తేజం, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రాత పూర్వక అంగీకారం తెలిపింది. దీంతో త్వరలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. ఆగిన చోట నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగించే అవకాశముంది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని, మళ్లీ నోటిఫికేషన్ ప్రకటించాలని గతంలోనే మెజార్టీ విపక్షాలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కోరాయి. న్యాయ నిపుణుల సూచనల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. గువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ని కలిసి తొలి దశ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడంపైనా, మిగతా మూడు దశల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. సాయంత్రం మళ్లీ సీఎస్ ఒక్కరే ఎస్ఈసీతో భేటీ అయినపుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా సీఎస్ వ్యక్తం చేశారు.
నిర్ణయం ఎలా ఉంటుందో?
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా మళ్లీ షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ ఇస్తారా? ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెడతారా అనే దానిపై ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారనగా, పుర, నగరపాలక సంస్థల్లో కార్పొరేటర్ స్థానాలకు వేసిన నామినేషన్లు పరిశీలన దశలో ఉండగా కరోనా కారణంగా గత మార్చిలో ఎన్నికలు వాయిదా వేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎస్ఈసీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూసినా వచ్చే నెలాఖరులోగా వాయిదా వేసిన ఎన్నికలు తిరిగి పూర్తి చేసేలా ఎస్ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.