Breaking News

నంది విగ్రహం ధ్వంసం కేసుని ఛేదించిన పోలీసులు

పురాతన ఆలయాలే లక్ష్యం..
సరిహద్దులు దాటి వచ్చి రెక్కీలు
సెల్‌ఫోన్లలో ఆలయాల ఫొటోలు, వీడియోలు
రెక్కీల్లో ‘హిందూ’ కలరింగ్‌
ఎనిమిది ఆలయాల్లో చోరీలకు చెక్‌
ఏడుగురు నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడించిన ‘సిట్‌’ అధికారి జీవీజీ అశోక్‌కుమార్‌

తెలుగు తేజం, నందిగామ : కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో గతేడాది సెప్టెంబర్‌ 10న నంది విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గుప్త నిధుల కోసమే ఓ ముఠా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ నాగేశ్వరరెడ్డిలతో కలిసి కృష్ణాజిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర సిట్‌ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మొత్తం గ్యాంగ్‌కు లీడర్‌ హైదరాబాద్‌ వాసవి కాలనీకి చెందిన అనుగొండ్ల శ్రీనివాస్‌. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా చిట్యాల కృష్ణయ్య, ఇట్టబోయిన విజయ్‌, మదని రామకృష్ణ స్నేహితులయ్యారు. కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన అపిరాల వెంకటప్పయ్య శాస్త్రి ఇంతకుముందు హైదరాబాద్‌లోని పలు దేవాలయాల్లో పనిచేయడంతో వారితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొద్దిరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చేశాడు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు నిందితులు పురాతన ఆలయాల్నే టార్గెట్‌ చేసుకున్నారు. కొద్దికాలంగా వాట్సాప్‌ల్లో హిందూ దేవాలయాలు, వాటి పురాతన చరిత్ర, ఆ ఆలయాలను ఏ కాలంలో నిర్మించారు, అక్కడ ఎలాంటి నిధులు ఉండేవన్న సమాచారంతో వీడియోలు, ఫొటోలను పోస్ట్‌ చేయడానికి అనేక గ్రూపులు ఏర్పడ్డాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆ గ్రూపుల లింక్‌లతో ఎవరెవరో వాటిలో చేరిపోతున్నారు. ఇలా పోస్ట్‌ అవుతున్న వీడియోలను ఈ గ్యాంగ్‌ నిశితంగా పరిశీలించేది. నిధులుంటాయని భావించిన ఆలయాల వద్దకు హైదరాబాద్‌ నుంచి కార్లలో చేరుకుని, రెక్కీ నిర్వహించేవారు. మక్కపేట శివాలయం వద్దకు కూడా ఈ విధంగానే వచ్చారు. భక్తులుగా ఆలయంలోకి వచ్చి దర్శనాలు చేసుకున్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. నిందితుల సెల్‌ఫోన్లలో ఒక్కో దాంట్లో 100 ఫొటోలు, వీడియోలు ఉంటే, వాటిలో 99 ఫొటోలు, వీడియోలు పురాతన ఆలయాలకు సంబంధించినవే ఉండడం గమనార్హం. నకిలీ గుర్తింపు కార్డులు. హిందూ దేవాలయాల అభివృద్ధి పరిరక్షణ సమితి పేరుతో గుర్తింపు కార్డులను తయారు చేసుకుని ఉంచుకునేవారు. మక్కపేట శివాలయంలో గుప్త నిధులు న్నాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇప్పుడు ఆలయం బయట ఉన్న నంది విగ్రహంలో వజ్రాలున్నాయన్న వీడియోను చూసి నిందితుల ఆశలకు రెక్కలొచ్చాయి. దీనితోపాటు తెలంగాణలోని మరో ఎనిమిది పురాతన ఆలయాల ఫొటోలను ఫోన్లలో భద్రంగా ఉంచుకున్నారు. నిందితుల్లో చిట్యాల కృష్ణయ్యపై మహబూబ్‌నగర్‌లో ఆలయ చోరీ కేసులున్నాయి. విగ్రహం చెవులను ధ్వంసం చేసి వెళ్లిన నిందితులు తొలగించిన విగ్రహాన్ని బయటకు తీసుకురావాలని రంగురాళ్ల వ్యాపారులతో రాయబారం పంపి పోలీసులకు దొరికిపోయారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *