Breaking News

పోలీసుల ‘మీడియా’ సమావేశాలపై.. 3నెలల్లోపు ‘మాన్యువల్‌’ రూపొందించండి!

దిల్లీ: క్రిమినల్‌ కేసుల దర్యాప్తు సమయంలో పోలీసులు ఏర్పాటు చేసే మీడియా సమావేశాల విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షపాతంతో కూడిన రిపోర్టింగ్‌ వల్ల నిందితుడు నేరం చేశాడనే అనుమానాలకు దారి తీస్తుందని అభిప్రాయపడింది. అందుకే క్రిమినల్‌ కేసులకు విషయంలో పోలీసులు మీడియాకు వెల్లడించే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలపై సమగ్ర గైడ్‌లైన్స్‌ మూడు నెలల్లోగా రూపొందించాలని హోం మంత్రిత్వశాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీని రూపకల్పనపై అన్ని రాష్ట్రాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ లు నెల రోజుల్లో సూచనలు చేయాలని, అటు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. క్రిమినల్‌ కేసులు దర్యాప్తు జరుగుతోన్న సమయంలో పోలీసులు అనుసరిస్తోన్న విధివిధానాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చండ్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సమయంలో ధర్మాసనం పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎన్‌కౌంటర్ల విషయంలో ‘పీయూసీఎల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ కేసులో (2014నాటి తీర్పులో) స్పష్టత వచ్చినప్పటికీ.. మీడియా సమావేశాలపై మాత్రం స్పష్టత రాలేదు. ఇదే విషయాన్ని సుప్రీం ధర్మాసనం తాజాగా ప్రస్తావించింది. ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టింగ్‌ విస్తరణ పెరుగుతోన్న క్రమంలో ఈ అంశం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా ప్రజాప్రయోజనాల విషయంలో ఇందులో ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయని చెప్పింది. దర్యాప్తు విషయాలు ప్రజలు తెలుసుకునే హక్కు, పోలీసులు వెల్లడించే అంశాలు దర్యాప్తుపై ప్రభావం, నిందితుల గోప్యత.. ఇలా మొత్తంగా న్యాయవ్యవస్థపై ప్రభావం వంటి అంశాలతో ముడిపడి ఉందని తెలిపింది. కొన్నేళ్లుగా క్రిమినల్‌ కేసుల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టింగ్‌ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. గతంలో రూపొందించిన (2010లో) నిబంధనలను అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మీడియాకు వెల్లడించే సమాచారం.. పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్టంగా ఉండాలని, బాధితుల వయసు, జెండర్‌తోపాటు నిందితుల గోప్యతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో పోలీసులు వెల్లడించే సమాచారం ‘మీడియా ట్రయల్స్‌’కు దారితీయకుండా ఉండాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *