Breaking News

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

చెన్నై : చలన చిత్ర పరిశ్రమను వరస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంతకాలంగా వరసగా నటీనటులను కోల్పోతుంది చిత్ర పరిశ్రమ. తాజాగా ప్రముఖ కమెడియన్ వివేక్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. శుక్రవారం వివేక్ కు గుండెపోటు రావడంతో చెన్నై లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సనిచ్చిన విద్య సిబ్బంది వివేక్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే వివేక్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే గుండెపోటు రావడంతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు దేవుడిని ప్రార్ధించినా ఎవరి కోరిక తీరలేదు.. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మరణించారు.

వివేక్ కోలీవుడ్ లో వడివేలు, సెంథిల్, గౌండ్రమణి తర్వాత హాస్యనటుడిగా ఆ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తమిళంలో సుమారు 240 సినిమాల్లో నటించారు. తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ కావడంతో ఆ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అపరిచితుడు, శివాజీ, ప్రేమికుల రోజు వంటి అనేక సినిమాలద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకానొక సమయంలో వివేక్ లేని తమిళ సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే వివేక్ తల్లి, తనయుడు ప్రసన్న కుమార్ మరణించిన తర్వాత వివేక్ మానసికంగా కృంగిపోయారు. అప్పటి నుంచి వివేక్ అనారోగ్య బారిన పడ్డారని తెలుస్తోంది. అప్పటి నుంచి సినిమాలను కూడా తగ్గించుకున్నారు.

కాగా చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ‘కరోనా బారి నుంచి సురక్షితంగా ఉండాలంటే మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం. టీకా వేసుకోవడం’ ముఖ్యం అని ప్రకటించారు. ఇంటి చిట్కాలు ఎన్ని పాటించినా.. టీకా మాత్రమే కరోనా నుంచి కాపాడుతుందని అన్నారు. ‘వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకదా? అని మీరు నన్ను అడుగొచ్చు. అయితే, టీకా తీసుకున్న వారిపై కరోనా ప్రభావం అంతగా ఉండదు. అందుకే కరోనా టీకా తీసుకోండి’ అని ట్వీట్ చేశారు. శుక్రవారం గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ.. శనివారం ఉదయం కన్నుమూశారు. వివేక్ మృతికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *