Breaking News

బ్రిటన్‌ రాణికి కొవిడ్‌ వ్యాక్సిన్‌!

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కొన్ని రోజుల్లో ఫైజర్‌ అభివృద్ధి చేసిన కరోనా టీకా తీసుకోనున్నట్లు సమాచారం. వ్యాక్సిన్‌ తీసుకున్న వెంటనే ఆ విషయాన్ని ఆమె బహిరంగంగా వెల్లడిస్తారని బకింగ్‌హామ్‌ రాజభవనం వర్గాలు తెలిపాయి. ఆమెతో పాటు భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌(99) కూడా టీకా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు వారివురు త్వరలోనే టీకా తీసుకునేందుకు సమ్మతించే అవకాశం ఉందని సమాచారం.

టీకా తీసుకున్న విషయాన్ని రాణి బయటకు వెల్లడించడం ద్వారా ప్రజల్లో వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలు తొలగిపోయే అవకాశం ఉందని బ్రిటన్‌ వైద్య వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించేందుకు రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ విలియమ్స్‌, ప్రిన్స్‌ చార్లెస్‌ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అయితే, టీకా ఇచ్చేందుకు రాజకుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏమీ ఉండదని అధికారులు తెలిపారు. ప్రజలకు టీకా వయసులవారీగా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాజకుటుంబానికి కూడా అదే నిబంధన వర్తిస్తుందని వెల్లడించారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధిపై ప్రిన్స్‌ విలియమ్స్‌ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి వారు రూపొందిస్తున్న టీకాపై ఆరా తీశారు. టీకా 90 శాతానికి పైగా సమర్థతను ప్రదర్శిస్తోందని తెలుసుకొని వారి కృషిని కొనియాడారు. మరోవైపు బుధవారం ఫైజర్‌ టీకాకు బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతులివ్వడంతో.. వ్యాక్సిన్‌ పంపిణీకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం నుంచి టీకాను ప్రజలకు అందజేసేందుకు ‘ఆపరేషన్‌ కరేజియస్‌’ పేరిట సన్నాహాలు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *