Breaking News

మినీ సంగ్రామానికి కౌంట్‌డౌన్‌ షురూ..! రేపే మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత పోలింగ్..

న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. మంగళవారం ఛత్తీస్‌గఢ్ (మొదటి విడత), మిజోరం ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి బ్రేక్ పడింది.. ప్రలోభాల పర్వం మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా.. తొలి దశలో 20 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మిజోరం అసెంబ్లీలో 40 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. కానీ తొలిదశలో ఓటు వెయ్యనివ్వకుండా భయపెట్టేందుకు మావోయిస్టులు కొంత హింసకు పాల్పడ్డారు. ఇది ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో..
ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో, 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని 40,78,681 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇందులో 19,93,937 మంది పురుషులు, 20,84,675 మంది మహిళలు, 69 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 20 స్థానాలకు గాను 5304 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాలు గెలుచుకోగా.. భూపేష్ బఘేల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ 43.9 శాతం ఓట్లను సాధించగా, బీజేపీ 15 సీట్లు గెలుచుకుని 33.6 శాతం ఓట్లను సొంతంచేసుకుంది.
పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ఎంపీ దీపక్ బైజ్ (చిత్రకోట్), మంత్రులు కవాసీ లఖ్మా (కొంటా), మోహన్ మార్కం (కొండగావ్), మహ్మద్ అక్బర్ (కవార్ధా), ఛవీంద్ర కర్మ (దంతెవాడ) తొలి దశలో అధికార కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ అభ్యర్థులలో ఉన్నారు. బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ (రాజ్‌నంద్‌గావ్), మాజీ మంత్రులు కేదార్ కశ్యప్ (నారాయణపూర్), లతా ఉసెండి (కొండగావ్), విక్రమ్ ఉసెండి (అంతగఢ్), మహేష్ గగ్డా (బీజాపూర్). కేశ్కల్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి నీలకంఠ టేకం పోటీ చేస్తున్నారు.

మిజోరంలో..
మిజోరం రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిజోరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, 1(ఒకరు) థర్డ్ జెండర్ ఉన్నారు. మిజోరంలో మొత్తం 4,973 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో మొత్తం 174 మంది ఉన్నారు. అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), జోరం పీపుల్స్‌ మూమెంట్‌, కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో అభ్యర్థులను రంగంలో దించాయి. బీజేపీ 23 మందిని, ఆప్ నలుగురిని పోటీలో నిలిపాయి. మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

2018 ఎన్నికలలో.. కాంగ్రెస్ – MNF మొత్తం 40 స్థానాల్లో పోటీ చేశాయి. MNF 28, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 39 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన జెడ్పీఎం అభ్యర్థులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *