నైజీరియాలో నేరస్థుల ముఠా దుశ్చర్య
అబుజా: బోకోహరం ఉగ్రవాద ముఠాకు చెందిన వారుగా అనుమానిస్తున్న కొందరు మిలటరీ దుస్తుల్లో వచ్చి వందలాది మంది విద్యార్థులను అపహరించిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. భద్రతా దళాలు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం రాత్రి కొందరు మిలటరీ దుస్తులు ధరించి కగరలోని ప్రభుత్వ కళాశాల వసతిగృహానికి వెళ్లి వారిని తుపాకులతో బెదిరించారు. అనంతరం వందల మంది విద్యార్థులను, కొందరు ఉపాధ్యాయులను దగ్గర్లో ఉన్న అడవిలోకి లాక్కువెళ్లారు. ఈ ఘటనలో ఒక విద్యార్థిని తుపాకులతో కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. అపహరణకు గురైన వారిలో ఒక ఉపాధ్యాయుడు, కొందరు విద్యార్థులు తప్పించుకున్నట్లు వారు వెల్లడించారు. ఎంతమందిని అపహరించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని వారు తెలిపారు. విద్యార్థులను కనిపెట్టేందుకు అన్ని రకాల చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
నైజీరియాలోని చాలా ప్రాంతాల్లో తరచూ చిన్నారుల అపహరణలు జరుగుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బోకోహరం ఉగ్రవాదులే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం కట్సిన రాష్ట్రంలో ఓ పాఠశాలకు చెందిన 300లకు పైగా విద్యార్థులను ఉగ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2014లో ఓ బాలికల వసతిగృహంపై దాడి చేసి 270 మందిని అపహరించారు. వారిలో చాలా మంది ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు.