- మషాఇక్ బోర్డు రాష్ట్ర కాన్ఫరెన్స్ ఏకగ్రీవ తీర్మానం
- ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న ముస్లింలకు న్యాయం చేయండి
- ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ మషాఇక్ బోర్డు సభ్యుల విజ్ఞప్తి
తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం:ముస్లిం హక్కులు, న్యాయం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు పోరాడేందుకు ఏపీ మసాఇక్ బోర్డు కాన్ఫరెన్స్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షా బుఖారి ఆస్థానంలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన పీఠాధిపతుల సమావేశం శుక్రవారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ మషాఇక్ బోర్డు అధ్యక్షుడు షేక్ షా షఫీ బాషా, ప్రధాన కార్యదర్శి షేక్ షా జకావుద్దీన్ హుస్సేనీ, అల్తాఫ్ రజా సమావేశం ముఖ్య అంశాలను విలేకరులకు వివరించారు. ముస్లిం మైనార్టీల సమస్యలను సమావేశంలో కూలంకుషంగా చర్చించినట్లు తెలిపారు. ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా ముస్లింలందరికీ పది శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ముస్లింల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సచార కమిటీ నివేదిక స్పష్టం చేసిందని చెప్పారు. వక్ఫ్ ఆస్తులు చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయని, వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లింల అభ్యున్నతికి ఉపయోగించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా ముస్లింల జీవన విధానం మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయి సంవత్సరాలు గడిచినా హైదరాబాద్ నుంచి రావలసిన వక్ఫ్ ఆదాయాన్ని ఇప్పటి వరకు పంచలేదన్నారు. ఇమామ్, మౌజన్ తో పాటు ఆదాయం లేని దర్గా ముజావర్లకు కూడా గౌరవ వేతనం చెల్లించాలని కోరారు. షాదీ ముబారక్ పథకం, ఇస్లామిక్ బ్యాంకు, బడ్జెట్ లో సబ్ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. వక్ఫ్ బోర్డును స్వయం ప్రతిపత్తి గల సంస్థగా గుర్తించి పూర్తి అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర భూ చట్టం కింద వక్ఫ్ భూములను సర్వే చేయించి పూర్తి వివరాలు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. వక్ఫ్ ఆస్తులలో ప్రభుత్వమే కర్మాగారాలు నిర్మించి ముస్లిం యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డులో సయ్యద్ లకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలోని ముస్లింలు, పీఠాధిపతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పూర్తి సహకారంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు తెలియజేస్తామని చెప్పారు. సమావేశంలో ఏపీ మషాఇక్ బోర్డు సహాయ కార్యదర్శి నూరుల్లా ఖాద్రి, కోశాధికారి సయ్యద్ చాన్సిర్ ఖాద్రి, నజీర్ బాబా, హబీబుల్లా బుఖారి, బాజీ బాబా, మత గురువులు పాల్గొన్నారు.