Breaking News

రైల్‌రోకో: అప్రమత్తమైన రైల్వేశాఖ

రంగంలోకి 20వేల మంది అదనపు బలగాలు

దిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలో భాగంగా 18వ తేదీన రైల్‌రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్రమత్తమైన రైల్వేశాఖ, ప్రభావిత రాష్ట్రాల్లో పలు రైళ్లను దారి మళ్లించడంతో పాటు కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఇక ముందుజాగ్రత చర్యగా 20కంపెనీల అదనపు బలగాలను రంగంలోకి దింపుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్(ఆర్‌పీఎస్‌ఎఫ్‌) వెల్లడించింది. ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు తెలిపింది.

‘ఇంటలిజెన్స్‌ నివేదికల అనుగుణంగా పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలపై దృష్టి సారించాం. ఇందుకోసం 20వేల అదనపు సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతాం’ అని రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. రైతు సంఘాలు రైల్‌ రోకోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతిఒక్కరూ శాంతియుతంగా ఉండాలని అరుణ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామన్న ఆయన, ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగా, తమ ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు ఆయా రాష్ట్రాల్లో మహా పంచాయత్ పేరుతో సభలు నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 18న నాలుగు గంటలపాటు (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) దేశవ్యాప్తంగా రైల్‌ రోకోను నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌ఎంకే) నిర్ణయించింది. రైల్‌ రోకో ప్రభావం ఉత్తర భారత్‌లో ఎక్కువగా కనిపించే అవకశాలున్నాయి. ఇప్పటికే జాతీయ/రాష్ట్ర రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని కూడా రైతు సంఘాలు నిర్వహించాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *