టెహ్రాన్ : ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ అణు పితామహుడు మొషిన్ ఫక్రజాదే దారుణ హత్య కలకలం రేపుతోంది. శాస్త్రవేత్త హత్యను ఆ దేశ ప్రధాని హసన్ రౌహనీ తీవ్రంగా ఖండించారు. ఇది పరికిపందల చర్యగా వర్ణించారు. దాడికి పాల్పడిన వారిపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. సైనికపరంగా తమను ఎదుర్కోలేక మొషిన్ అత్యంత దారుణంగా హతమార్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శాస్త్రవేత్త హత్యతో ఇరాన్ అణ్వాయుధ సంపత్తిని, సైనిక బలాన్ని ఎవరూ అడ్డుకోలేరని సరైన సయమంలో స్పందించి తీరుతామని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సైతం రౌహానీ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ దారుణ హత్య వెనకున్న హస్తలన్నీ తమకు తెలుసని పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్‌పై వ్యాఖ్యలు చేశారు. కాగా ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమాని హత్యకు కారణం కూడా అమెరికానే అంటూ హసన్ రౌహానీ బహిరంగంగా ఆరోపించిన విషయం తెలిసిందే. 2012 నుంచి 2016 మధ్య నలుగురు ఇరాన్ శాస్త్రవేత్తలు హత్యకు గురైయ్యారు. వీరివెనుక ఇజ్రాయెల్ హస్తముందని రౌహానీ బలంగా వాదిస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్త హత్యపై ఇరాన్ వ్యాప్తంగా నిరసన ఆగ్రహం పెల్లుబికుతోంది. దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి నివాదాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగమంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ ఇజ్రాయెల్‌పై ఆరోపణలు గుప్పించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘మొహిన్ పేరును గుర్తుపెట్టుకోండి. ఇరాన్లో చాలా గొప్ప, బలమైన శాస్త్రవేత్త. భవిష్యత్‌లో మరోసారి ఆయన పేరును మనం వినే అవకాశం ఉందంటూ’ చేసిన వ్యాఖ్యలను జావేద్ గుర్తుచేశారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని ఇరాన్ రక్షణ విభాగానికి చెందిన ముఖ్య అధికారి వెల్లడించారు. మరోవైపు మొహిన్ మరణంపై ఇజ్రాయెల్ మోనం వీడింది. ఆయన మృతి ఇరాన్‌కు తీవ్ర నష్టం చేకూర్చుతుందని పేర్కొంటూ ఓట్వీట్ చేసింది. దీనిని డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేయడం గమనార్హం. కాగా ఇరాన్- అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందం నుంచి కూడా ట్రంప్ వైదిలిగారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. సులేమాని హత్య అనంతరం మాటల యద్ధం తారా స్థాయికి చేరింది.