అమరావతి : స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరుచేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్కిల్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్‌తోపాటు.. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు.