షిమ్లా: హిమాలయ రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు విళయం సృష్టించాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో రాష్ట్రం మొత్తం అలాకుతలమైంది. వర్షాలు, వరదలతో వందలాది మంది మరణించగా, వేల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా బురద మేటలువేసింది. ఇక పశువులు, ఇతర జంతువుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్లో కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని, వేల కోట్ల మేర నష్టం పోయామని సీఎం సుఖ్విందర్ సింగ్ సిఖు చెప్పారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయమై జీ 20 సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీని కోరారు. అయినా మోదీ సర్కార్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షం సృష్టించిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని తాము అదేపనిగా డిమాండ్ చేస్తున్నామని సీఎం అన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. అయినప్పటికీ రెండు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు తన వద్ద సరైన సమాధానం ఉన్నదని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వాటికి తగిన జవాబు చెబుతానని స్పష్టం చేశారు. కాగా, జూన్ 24వ తేదీన రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడంతో కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో సుమారు 400 మంది మరణించారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు. 2,500 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 11 వేల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రం రూ.80 వేల కోట్లకుపైగా నష్టపోయిందని అంచనా వేశారు.