తెలుగు తేజం, కంచికచర్ల : 2020 సంవత్సరంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్, రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ, వైద్య మరియు ఆరోగ్య, రెవిన్యూ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇతర శాఖల వారికి 2020 సంవత్సరానికి గాను రహదారి ప్రమాదాల నివారణకు కృషిచేసిన వారికి మరియు మంచి ప్రతిభ కనబరిచిన వారికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.డి.ఇంతియాజ్ గారు జిల్లా ఎస్పీ ఇతర అధికారులతో కలసి సోమవారం కలెక్టరు వారి కార్యాలయంలో “32వ జాతీయ రహదారి భద్రత ఛాంపియన్ ” అవార్డులు బహుకరించారు. కృష్ణ జిల్లా పోలీసు శాఖలో కంచికచర్ల ఎస్సైగా పనిచేస్తున్న M.P.S.S.రంగనాథ్ కి ఈ అవార్డు లభించింది, ఈ అవార్డును పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ చేతులమీదుగా ఎస్ఐ రంగనాథ్ అందుకొన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ అనుకోని రీతిలో ప్రమాదం సంభవించినపుడు, సకాలంలో క్షతగాత్రులను ఆసుపత్రులకు చేరవేయడంలోను మరియు రహదారి ప్రమాదాల నివారణే ధ్యేయంగా విధులు నిర్వహించినందుకు గాను ఈ అవార్డు రంగనాథ్ లభించడం సంతోషంగా ఉందన్నారు. రంగనాథ్ ను స్ఫూర్తిగా తీసుకుని, జిల్లాలోని పోలీసు అధికారులు అందరూ రహదారి ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు రంగనాథ్ ని ప్రత్యేకంగా అభినందించారు.