ఇబ్రహీంపట్నం (తెలుగు తేజం ప్రతినిధి):
కారంచేడు ఘటనలు రాష్ట్రంలో దేశంలో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చట్టాలను పటిష్ఠంగా అమలు చేసి దళితులకు రక్షణ కల్పించాలని బీసీ సమన్వయ కమిటీ వ్యవస్థాపకుడు ఎన్.శివశంకర్ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాల ఎదుట ఏపీ ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కారంచేడు మృత వీరులకు శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కారంచేడులో 1985 జూలై 17న జరిగిన మారణకాండలో ఆరుగురు బలైపోయాయని చెప్పారు. ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మందా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ కారంచేడు ఘటన జరిగి 36 సంవత్సరాలు పూర్తయినా ఆ చేదు జ్ఞాపకాలు దళితుల గుండెల్లో మరువరాని గాయంగానే ఉందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎస్సీ, ఎస్టీ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నల్లమోతు మధుబాబు, సోడగుడి కోటేశ్వరరావు, డి.మల్లికార్జునరావు, పచ్చిగోళ్ల పండు, కోలకాని శ్రీనివాసరావు, మేడా రాధా, మొగిలి నాగరాజు, మైలవరం నియోజకవర్గ జనశక్తి అధ్యక్షుడు చల్లా దుర్గారావు, జంపని ఉషా తదితరులు పాల్గొన్నారు.