బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త వైరస్ స్ట్రెయిన్‌పై ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ‘స్ట్రెయిన్’ వైరస్ విషయం తెలిసిన వెంటనే యూరప్‌లోని అనేక దేశాలు యూకేతో రాకపోకలు నిలిపేస్తున్నట్లు వెల్లడించాయి. అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న భారతదేశం కూడా నేటి అర్థరాత్రి నుంచి ఈ నెలాఖరు వరకు బ్రిటన్ విమానాలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కొత్తరకం కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ‘స్ట్రెయిన్’ వైరస్ గురించి పూర్తి సమాచారం తెలిసే దాకా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆయా ప్రభుత్వాల సూచనలు మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
దీంతో ఎయిర్ ఇండియా తన సిబ్బందికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. దేశీయ, అంతర్జాతీయ విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా వేర్వేరు గదుల్లో ఐసోలేషన్‌లో ఉండాలని సిబ్బందిని ఆదేశించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులందరూ విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరవిమానయానశాఖ సర్క్యులర్ జారీ చేసింది. డిసెంబరు 22వతేదీ రాత్రి 11.59 గంటల లోపు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకొని క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది. కొత్త స్ట్రెయిన్ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బ్రిటన్ దేశంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించలేమని ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.