తెలుగు భాషా విశిష్టతను విద్యార్థులకు వివరిస్తూ… తెలుగు భాషపై మమకారంతో రచనలు చేస్తూ… తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల వికాసానికి వారధిగా నిలుస్తూ… తేనెలాంటి మధురమైన తెలుగు భాషకు తన వంతు సేవలు చేస్తున్నారు ఉపాధ్యాయులు కొండూరు వెంకటేశ్వరరాజు. తిరుపతి జిల్లా గూడూరు గ్రామీణం నెర్నూరు ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఆయన రచయితగా, ఉపాధ్యాయునిగా రెండు దశాబ్దాలుగా తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తున్నారు. విభిన్న సాహిత్య ప్రక్రియలతో రచనలు చేస్తూ తెలుగు తల్లికి అక్షర హారతులు సమర్పిస్తున్నారు. అనేక కవి సమ్మేళనంలో పాల్గొని తన సాహిత్య ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. బాలల్లో తెలుగు భాషపై ఆసక్తి పెంచడానికి బాల సాహిత్యం రచిస్తున్నారు. బాల సాహిత్య పుస్తకాలను ఆవిష్కరించి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తూ తెలుగు భాషకు వారసులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల విశిష్టతపై అవగాహన కలిగిస్తున్నారు సేవలకు గుర్తింపుగా. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన రచనల పోటీలలో విజేతగా నిలిచి బహుమతులు అందుకున్నారు వివిధ సాహిత్య సంకలనాలలో ఆయన రచనలు ప్రచురింపబడి పాఠకుల అభిమానం పొందాయి. సాహితీ చక్రవర్తి, సాహితీ కిరణం, సాహితీ వల్లభ గురుబ్రహ్మ మొదలైన బిరుదులు అందుకున్న ఆయన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి మరియు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ.. అవనిపై అమ్మ ఉన్నంత వరకు అమ్మభాషను మరవలేమన్నారు. కొలవుల కోసం పరభాషలపై వ్యామోహం తగదన్నారు. సమగ్ర వికాసానికి విలువైన మాధ్యమం తెలుగు భాషని ఆరాధ్య దైవంగా భావించి ఆదరించాలని పిలుపునిచ్చారు.