తెలుగుతేజం, విజయవాడ: ఆర్థిక సమతా మండలి కార్యదర్శి శ్రీమతి నౌ గోరా ఈ రోజు తెల్లవారు జామున మరణించారన్న వార్త పిడుగు పాటులా వినిపించింది. నాస్తిక కేంద్రంలో జరిగే అన్ని కార్యక్రమాలలో ఎంతో చలాకీగా పాల్గొనే నౌ గోరా భౌతికంగా లేరంటే నమ్మలేకున్నారు దివి ప్రజలు..
ప్రముఖ సంస్కర్త, నాస్తికోద్యమ నాయకుడు శ్రీ గోరా, శ్రీమతి సరస్వతి గోరాల కు 24-11-1948 వ తేదీన తొమ్మిదవ సంతానంగా జన్మించి నందున నౌ అని పేరు పెట్టారు.
తల్లితండ్రుల సేవానిరతిని అందిపుచ్చుకున్న శ్రీమతి నౌ శ్రీవీరయ్యతో వివాహమైన తరవాత సేవాకార్యక్రమాల్లో, గాంధేయ నిర్మాణ కార్యక్రమాల్లో చురుకైన పాత్రను పోషిస్తు వచ్చారు. 1977 ఉప్పెన- తుఫాను లో సేవలందిచడాానికి శ్రీకాకుళం కేంద్రంగా ఆర్దిక సమతా మండలి స్దాపించి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాలుగు దశాబ్దాలుగా దివిసీమ ప్రజలకు సేవ లందించారు.
దివిసీమలో ఆక్వా పరిశ్రమని ప్రారంభించింది వారే. సి.బి.సి.యన్.సి పాఠశాలలకు భవనాలు నిర్మించడమే కాక నాణ్యమైన విద్య అందించారు. చేనేత కార్మికులకు ప్రత్యేక మగ్గాలు తయారు చేయించి తదనుగుణంగా పక్కా ఇళ్లు నిర్మింపచేశారు. బాల్వాడీలు, మహిళలకు శిక్షణా కేంద్రాలు నెలకొల్పారు. సైన్స్ ఎగ్జిబిషన్లు పెట్టి పిల్లల్లో శాస్తీయ దృక్పధం పెంచే కృషి చేశారు. మహిళలు ఆర్దికంగా ఎదగడానికి సహకార సంస్దలు నెలకొల్పారు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. నిస్వార్ద సేవాదృక్పధంతో వారు చేసిన సేవలు సామాన్యమైనవికావు.
ఎప్పుడు చెదరని చిరునవ్వుతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు.
దివిసీమ ప్రజలు ఒక సేవామూర్తిని కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆపన్న హస్తం అందించే అమృత మూర్తిని కోల్పోయాం. సాంఘీక సేవారంగానికి ఆమె మృతి తీరని లోటు.
శ్రీమతి నౌగోరాకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, కుటంబ సభ్యులకు, ఆర్దిక సమతామండలి, నాస్తిక కేంద్రం కార్యకర్తలకు తెలుగుతేజం సానుభూతి తెెలుపుతున్నది.
–కేతన సత్యనారాయణ