తెలుగు తేజం, అమరావతి: పాత్రికేయులకు… వారి కుటుంబ సభ్యులకు తక్షణమే కరోనా వ్యాక్సిన్ వేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో అక్రెడిటేషన్ కార్డులు, ఆరోగ్య బీమా కార్డుల జారీ కూడా సక్రమంగా చేపట్టడం లేదని విమర్శించారు. నిబంధనల పేరుతో వేల మంది రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు నిలిపివేశారన్నారు. పట్టణ ప్రాంత, మండల స్థాయి విలేకర్లు ఈ గుర్తింపు కార్డులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ స్కీమ్స్ కూడా అమలు కావడం లేదని ఆయన అన్నారు.
కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి విలేకర్లు ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేస్తున్నారని… వాళ్ళ ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాల్సి ఉందని సూచించారు. ఇప్పటికే కొందరు పాత్రికేయ మిత్రులు, వారి కుటుంబ సభ్యులు కరోనా మూలంగా ప్రాణాలు విడిచారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం – జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని తెలిపారు. రాష్ట్ర సమాచార శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జగన్ రెడ్డికి, ఆయన మంత్రులకు విలేకర్ల సంక్షేమంపై ఏ మాత్రం బాధ్యత లేదన్నారు. జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ వేయించే బాధ్యతను సమాచార శాఖ తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ కోరారు.