ఉమ్మడి కర్నూలు జిల్లా (బనగానపల్లె) : మహిళల జీవితాలు మార్చేందుకే మహాశక్తి పధకం రూపొందిచామని అధికారంలోకి రాగానే అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలో మహిళా ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… మహిళా ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన నా ఆడపడుచులందరికీ స్వాగతం.. సుస్వాగతం. మీతో కలిసి మీ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడం ఆనందించాల్సిన విషయమన్నారు. గతంలో డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు ముందు ఇలానే ఆడబిడ్డలతో సమావేశమయ్యాను. ఇప్పుడు మీకోసమే ‘మహాశక్తి’ కార్యక్రమం తీసుకొచ్చానన్నారు. దానిలో భాగంగా చరిత్రలో గతంలో ఏంచేశామో ఆలోచిస్తేనే భవిష్యత్ లో ఎలా ముందుకెళ్లాలో తెలుస్తుందన్నారు. ఆడబిడ్డలు అన్నిరంగాల్లో మగవారితో సమానంగా రాణించాలని ఎన్టీఆర్ ఆలోచించారన్నారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించారన్నారు. వారి ఉన్నత విద్యకోసం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారన్నారు.