Breaking News

 జంతువులు లేవు కానీ.. 20 కోట్లు పెట్టి బోన్లు కొన్నారు.. ముంబై కార్పొరేషన్‌ అధికారుల నిర్వాకం

ముంబై : ఎనకటికి ఎవడో బర్రెను కొనకముందే దాని తలుగు కొన్నాడంట! బృహాన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు చేసిన పని కూడా అదే చందంగా ఉంది. ముంబైలోని బైకుల్లా జూలో జంతువులను ఉంచేందుకు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి మరి అధునాతన ఎన్‌క్లోజర్లను కొనుక్కొచ్చారు. అయితే ఆ అధికారులు ఏ జంతువులను బంధించి ఉంచేందుకు అయితే ఎన్‌క్లోజర్లను కొనుగోలు చేశారో సదరు జంతువులు ఆ జూలోనే లేకపోవడమే అసలు ట్విస్ట్‌. సమాచార హక్కు చట్టం కింద విజిల్‌ బ్లోయర్స్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన దరఖాస్తులో ఈ విషయాలు బయపడ్డాయి.

ఆర్టీఐ ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. సింహాలను ఉంచే ఎన్‌క్లోజర్ల కోసం రూ.8.25 కోట్లు, తోడేళ్ల కోసం 7.15 కోట్లు, నీటి పిల్లుల కోసం 3.82 కోట్లను బీఎంసీ అధికారులు ఖర్చుచేశారు. ఈ విషయం తెలిసిన ప్రజలు బీఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేకుండా ఇలా లేని జంతువులకు బోన్‌లను నిర్మించడమంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శల నేపథ్యంలో బీఎంసీ అధికారులు కూడా స్పందించారు. ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఎన్‌క్లోజర్లను కొనుగోలు చేశామని చెప్పారు. ముందే కొనుగోలు చేయకపోతే స్టెయిన్‌లెస్‌ స్టీల్, కాంక్రీట్‌, ఇతర నిర్మాణ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని.. అందుకే జూపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో ముందుగానే వాటిని కొనుగోలు చేశామని వివరణ ఇచ్చారు. అసలే చేసింది మోసం కాగా.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు చెప్పిన సాకులు కూడా ఇప్పుడు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *