Breaking News

అధ్యక్షుడిగా బైడెన్‌ తొలి సంతకం.. కీలక నిర్ణయాలు

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్వేతసౌధంలోకి వెళ్లిన జో బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు జో బైడెన్‌ అధ్యక్షుడి హోదాలో సంతకం చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న కీలక నిర్ణయాలపై బైడెన్‌ ఎన్నికల్లో చెప్పినట్టు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఈ విధంగా 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై బైడెన్‌ సంతకాలు చేశారు. బైడెన్‌ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనవి ఇవే..

బైడెన్‌ తొలి నిర్ణయం కరోనా నుంచి ప్రజలను బయటపడడమే. అందులో భాగంగా కోవిడ్‌-19 రెస్పాన్స్‌ కో ఆర్డినేటర్‌ పదవిని సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు వంద రోజుల పాటు మాస్క్‌లు, భౌతిక దూరం పాటించాలని బైడెన్‌ పిలుపునిచ్చారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి వైదొలగడాన్ని విరమించుకున్నారు. ట్రంప్‌ హయాంలో అమెరికా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
అమెరికా- పారిస్‌ వాతావరణ ఒప్పందంలో బైడెన్‌ నిర్ణయంతో అమెరికా మళ్లీ చేరింది. ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతూ ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది.
మెక్సికో గోడ నిర్మాణంపై బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి నిధుల సమీకరణకు తీసుకొచ్చిన నేషనల్‌ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ను నిలిపివేశారు.
గ్రీన్‌ కార్డు జారీలో దేశాలకు పరిమితిని బైడెన్‌ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో పాటు ఎన్నో దేశాల వారికి ఉపశమనం కలగనుంది. అమెరికా వీసాల జారీలో ఆంక్షలను క్రమేణ ఎత్తివేసేలా బైడెన్‌ వ్యూహం ఉంది.
అమెరికా అభివృద్ధిలో కీలకంగా ఉన్న వలసదారులకు శాశ్వత పౌరసత్వం, నివాసం కల్పిస్తూ బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు.
వీటితో జాతి వివక్ష, ముస్లిం దేశాల రాకపోకలపై నిర్ణయాలు ఉన్నాయి.

మొత్తానికి బైడెన్‌ గత అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. అమెరికా ప్రజలకు మేలు చేస్తూనే ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకునేలా బైడెన్‌ తీరు కనిపిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *