Breaking News

అమెరికాలో మళ్లీ కొవిడ్‌ ఉగ్రరూపం

24 గంటల్లో రికార్డు స్థాయిలో 90వేలకు పైగా కేసులు

అయినా మారని ట్రంప్‌ తీరు

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోన్న అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌ వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఆ మధ్య కాస్త తగ్గినట్లే కన్పించినా.. గత వారం రోజులుగా కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 90వేలకు పైగా కేసులు నమోదవడం అగ్ర దేశంలో వైరస్‌ పరిస్థితికి అద్దం పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ గణాంకాలు అమెరికన్లను కలవరపెడుతున్నాయి. అయితే నానాటికీ కేసులు పెరుగుతున్నా.. అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని చెప్పడం గమనార్హం.

90లక్షలకు చేరువలో కేసులు

జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో(అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8.30 గంటల వరకు) 91,295 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 89.4లక్షలకు చేరింది. ఇక ఇదే సమయంలో 1,021 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు అమెరికా 2,28,625 మంది వైరస్‌ వల్ల మృతిచెందారు. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు, మరణాలు సంభవించిన దేశం అమెరికానే. నెల క్రితం వరకు కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు.. అక్టోబరు మధ్య నుంచి మళ్లీ ఒక్కసారిగా పెరుగుతూ పోతున్నాయి. రెండు వారాల క్రితం రోజువారీ సగటు కొత్త కేసుల సంఖ్య 52వేలు ఉండగా.. ప్రస్తుతం 74వేలకు పెరిగినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ డేటా వెల్లడించింది. 15 రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల 10శాతం, అంతకంటే ఎక్కువే ఉంది. 45 రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. న్యూజెర్సీ, రోడ్‌ ఐలాండ్‌, ఉత్తర డకోటా తదితర రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ట్రంప్‌ భిన్న వాదనలు.. నిపుణుల హెచ్చరికలు

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా అధ్యక్షుడు ట్రంప్‌ తీరు మాత్రం మారట్లేదు. ఇప్పటికే చాలా సార్లు వైరస్‌ ప్రభావాన్ని తక్కువ చేసి మాట్లాడిన ట్రంప్‌.. ఇప్పుడు కూడా మళ్లీ అదే వాదన వినిపిస్తున్నారు. కరోనా ప్రభావం అంతగా ఏం లేదని, పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని అంటున్నారు. నిపుణుల హెచ్చరికలను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే ఇదే సమయంలో తన ప్రభుత్వ ఆరోగ్య అధికారులు మాత్రం కరోనా తీవ్రంగా ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అత్యవసరం ఏర్పడిందని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో శీతాకాలం ఆరంభం కానున్న నేపథ్యంలో వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *