Breaking News

ఏపీలో తెరచుకున్న విద్యా సంస్థలు

అమరావతి: కరోనా కారణంగా ఏపీలో దాదాపు ఏడు నెలలుగా మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరచుకున్నాయి. పకడ్బందీ మార్గదర్శకాల నడుమ పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 180 రోజులపాటు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకున్న పనిదినాల్లో 144 రోజులు క్లాసుల్లోనే బోధిస్తారు. మిగిలిన ఆదివారాలు, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఇళ్ల వద్దే చదువుకుంటారు. స్వగ్రామాలకు వచ్చిన వలస కార్మికుల పిల్లలకు ఇబ్బంది కలగకుండా తక్షణ ప్రవేశాలు కల్పించాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. పిల్లలు, పాఠశాల సిబ్బంది ఆరోగ్యం, పరిశుభ్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలలు తెరుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం నిర్దేశిత ప్రామాణిక విధానాలను (ఎస్‌ఓపీ) ప్రకటించింది. నవంబరు నెలాఖరు వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 1.30 వరకు తరగతులు నిర్వహించాలి. నవంబరులో ఎదురయ్యే పరిస్థితులను పరిశీలించి డిసెంబరులో నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు. వారంతా ఆరడుగుల దూరం పాటించాలి. విద్యార్థుల సంఖ్య 750కి మించితే 3విభాగాలుగా చేసి 3 రోజులకోసారి హాజరయ్యేలా చూడాలి.

విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎడం పాటిస్తూ తరగతులు నిర్వహించేందుకు ప్రశాంతంగా ఉండే ఇతర స్థలాలను తాత్కాలికంగా వినియోగించుకోవచ్చు. ఉపాధ్యాయులు ప్రతి రోజూ హాజరుకావాలి. అన్ని పాఠశాలల యాజమాన్యాలు వార్షిక క్యాలెండర్‌ను అనుసరిస్తూ తరగతులను నిర్వహించాలి. హాజరైనవారికి మధ్యాహ్న భోజనం అందించాలి. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు కూడా దగ్గరలోని పాఠశాలల్లో రోజువారీ హాజరుకావొచ్చు. అక్కడ వారికి మధ్యాహ్నభోజనం పెట్టాలి. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఈనెల 2 నుంచి వసతిగృహాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. ఒకవేళ సంబంధిత సంస్థలు సన్నద్ధంగా లేనట్లయితే 23లోపు ఎప్పుడైనా తెరచుకోవచ్చు. ఈలోగా విద్యార్థులను దగ్గర్లోని పాఠశాలలకు హాజరయ్యేలా చూడటంతోపాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *