Breaking News

కొవిడ్‌ వర్క్‌షాప్‌: పాక్‌ను ఆహ్వానించిన భారత్‌!

దిల్లీ: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోన్న వేళ.. ఈ సంక్షోభంపై చర్చించేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. ఫిబ్రవరి 18వ తేదీన భారత్‌ నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌నకు పాకిస్థాన్‌ను ఆహ్వానించింది. ఆరోగ్యశాఖ కార్యదర్శుల స్థాయిలో జరుగుతోన్న ఈ వర్క్‌షాప్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి సంక్షోభం, వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికలపై సభ్యదేశాలు ఈ కార్యశాలలో చర్చించనున్నాయి.

గతేడాది మార్చి 15న సార్క్‌దేశాల అధినేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో.. కరోనావైరస్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. తద్వారా ఈ ప్రాంతంలో కరోనా వైరస్‌ సంక్షోభం నివారణకు చర్యలు చేపట్టవచ్చని సూచించారు. ఇందుకోసం 10మిలియన్‌ అమెరికన్ డాలర్లను భారత్‌ అందజేస్తుందని ప్రకటించారు. ప్రధాని ప్రతిపాదనకు ఇతర సభ్యదేశాలు కూడా మద్దతు తెలిపాయి. ఇక కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ తయారీలో ముందున్న భారత్‌, పొరుగు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌లను అందిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు 20లక్షల డోసులు, మయన్మార్‌కు 17లక్షల డోసులు, నేపాల్‌కు10లక్షలు, భూటాన్‌కు 1.5 లక్ష, మాల్దీవులకు లక్ష, శ్రీలంకకు 5లక్షలు, ఆఫ్ఘనిస్థాన్‌కు 5లక్షల వ్యాక్సిన్‌ డోసులను పంపించింది.

దక్షిణాసియా దేశాలకు చెందిన ఈ కూటమిలో ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, భారత్‌, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్థాన్, శ్రీలంక దేశాలున్న విషయం తెలిసిందే. 2014లో నేపాల్‌ సార్క్‌ సదస్సును నిర్వహించింది. 2016లో పాకిస్థాన్‌లో సదస్సు జరగాల్సి ఉన్నప్పటికీ, భారత్‌ వైదొలగడంతో ఆ సదస్సు రద్దు అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *