Breaking News

భారత్‌ ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది: మోదీ

దిల్లీ: సరిహద్దు అంశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే, భారత్‌ ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోందనే విషయం స్పష్టమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. జియో స్పేషియల్‌పై ఉన్న నియంత్రణలను తొలగించడంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు. నాస్కామ్‌ టెక్నాలజీ, లీడర్‌షిప్‌ ఫోరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ, ఐటీ రంగంలో ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను తీసుకువస్తుందన్నారు.

‘ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భారత్‌ శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. ఈ నిర్ణయాలు దేశ భద్రతకు మరింత భరోసాను కల్పించడంతో పాటు దేశ యువత శక్తి సామర్థ్యాలను ప్రపంచ వేదికపై రాణించేందుకు అవకాశం కల్పిస్తుంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అంకుర వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేస్తాయన్న మోదీ, భారత్‌ చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్‌కు ఎంతో సహాయపడతాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వేదికలపై అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు యువ పారిశ్రామికవేత్తలకు పూర్తి స్వేచ్ఛ అవసరమని, ఇదే ఆలోచనా తాజా నిర్ణయాలకు దారితీసిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయడంపై కార్పొరేట్‌ సంస్థలు దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ ఐటీ కంపెనీలకు సూచించారు.

ఇదిలాఉంటే, లద్దాఖ్‌ సరిహద్దులో గత కొన్ని నెలలుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో చివరకు చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంది. ఇక మ్యాప్‌ల తయారీ, జియోస్పేషియల్‌ డేటా ఉత్పత్తిపై నియంత్రణలు తొలగించేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించింది. దీనివల్ల దేశంలోని రైతులు, అంకుర పరిశ్రమలు, ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు, పరిశోధన సంస్థలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకూ మ్యాపింగ్‌ ప్రక్రియను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘సర్వే ఆఫ్‌ ఇండియా’ సంస్థ నిర్వహించేది. తాజా సరళీకరణతో దేశంలోని ఏ సంస్థ అయినా ఈ ప్రక్రియలో పాల్గొని, లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *