Breaking News

జీ20 సదస్సులో తొలిరోజు హైలైట్స్‌!

దిల్లీ: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సు తొలిరోజున.. సభ్యదేశాలు పలు కీలక అంశాలపై చర్చించాయి. ‘దిల్లీ డిక్లరేషన్‌’పై ఏకాభిప్రాయం రావడంతోపాటు ఆఫ్రికన్‌ యూనియన్‌(African Union) సభ్యత్వానికి ఆమోదం వంటి అనేక విషయాలపై స్పష్టత వచ్చింది.

ఇదే సమయంలో పలు సభ్యదేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశాల్లో పలు అంశాలను పరిశీలిస్తే..

  • ఆఫ్రికన్‌ యూనియన్‌ ప్రవేశం: 55 దేశాలు సభ్యులుగా ఉన్న ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు సభ్యదేశాలు అంగీకరించినట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. కీలకమైన ఆఫ్రికన్‌ యూనియన్‌ను కూటమిలో చేర్చడాన్ని భారత్‌ ప్రతిపాదించగా.. అందుకు సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి.
  • దిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం: జీ20 తీర్మానానికి సభ్యదేశాలన్నీ అంగీకరించినట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
    ఉక్రెయిన్‌ సంక్షోభంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతోన్న తరుణంలో భారత అధ్యక్షతన జరిగిన సదస్సులో ‘దిల్లీ డిక్లరేషన్‌’పై సభ్యదేశాలు ఏకతాటిపైకి రావడం భారత్‌ సాధించిన చారిత్రక విజయమని ప్రభుత్వం భావిస్తోంది.
  • ప్రపంచ జీవఇంధన కూటమి: ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రారంభిస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపేందుకు ఉద్దేశించిన ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
    • G20శాటిలైట్‌ మిషన్‌ ప్రతిపాదన: వాతావరణం, పర్యావరణ పరిశీలన కోసం ప్రత్యేకంగా ‘జీ20 శాటిలైట్‌ మిషన్‌’ను భారత్‌ ప్రతిపాదించింది. ఇందుకోసం భారత్‌ చేపట్టిన ‘గ్రీన్‌ క్రెడిట్‌ ఇనిషియేటివ్‌’ కార్యక్రమంపై నేతలు పని చేయడం ప్రారంభించాలని కోరారు.
    • బ్రిటన్‌ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు: జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పెట్టుబడులకు ఊతమివ్వడం, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన మోదీ.. సంపన్న, సుస్థిర ప్రపంచం కోసం భారత్‌, బ్రిటన్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయని అన్నారు.
    • జపాన్‌ ప్రధానితో మోదీ భేటీ: జీ20 సదస్సు నేపథ్యంలో అటు జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించామని.. అనుసంధానం, వాణిజ్యంతోపాటు ఇతర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇరునేతలు చెప్పారు.

    About The Author

    Related posts

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *