Breaking News

9/11 విషాదం..22 ఏళ్ల తర్వాత ఇద్దరు మృతుల గుర్తింపు

వాషింగ్టన్‌: 2001లో ఇదే సెప్టెంబర్ 11 న అల్‌ఖైదా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంతో అమెరికా వణికిపోయింది. ఆ విషాదంలో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పటికీ మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు మృతుల గుర్తింపును తాజాగా నిర్ధారించడం గమనార్హం. ఈ విషయాన్ని న్యూయార్క్‌ చీఫ్ మెడికల్‌ ఎగ్జామినర్ వెల్లడించారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఆ ఇద్దరి మృతుల వివరాలు బయటకు వెల్లడించలేదని అధికారులు తెలిపారు. ఆ ఘటనలో సేకరించిన అవశేషాలకు నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్ష ద్వారా వారి గుర్తింపును నిర్ధారించినట్లు తెలిపారు. ఆ భీకరదాడిలో మృతి చెందిన వారి అవశేషాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ వాగ్దానం చేసిందని, తాజాగా చేపట్టిన కార్యక్రమం అందుకు నిదర్శనమని చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ అన్నారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆధునాతన సాంకేతికతను ఉపయోగించామని చెప్పారు.
ఇదిలా ఉంటే.. అమెరికా చరిత్రలో అత్యంత విషాదాన్ని మిగిల్చిన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి ఘటన జరిగి 22 ఏళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇంకా మృతుల్లో దాదాపు 40 శాతం అంటే 1,104 మంది అవశేషాలను గుర్తించాల్సి ఉంది. ఈ గుర్తింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ దాడితోనే అమెరికా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టింది. ఈ దాడులకు సూత్రధారి, అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ను ఉత్తర పాకిస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించిన అమెరికా.. 2011లో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి అంతం చేసింది. అమెరికాలో ఉగ్రదాడి అనంతరం అఫ్గానిస్థాన్‌లో సైన్యాన్ని మోహరించిన అగ్రరాజ్యం.. అనేక మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఇలా సుదీర్ఘ కాలం పాటు అఫ్గాన్‌లో తన సేనలను కొనసాగించిన అగ్రరాజ్యం.. 2021 ఆగస్టులో బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *