Breaking News

ప్రయోగాత్మకంగా ఇంటినుంచే ఓటు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అమలు!

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రానున్న అన్ని ఎన్నికల్లో సాంకేతికతకు ఈసీ పెద్దపీట వేయనున్నది. ఇక ప్రయోగాత్మకంగా ఇంటినుంచే ఓటు వేసే వ్యవస్థను పైలెట్‌గా తెరపైకి తెచ్చి అమలు చేయాలని సంకల్పిస్తోంది. తెలంగాణఎన్నికల సంఘం(టీఎస్‌ఈసీ)మదిలో పుట్టిన ఆలోచన అయిన చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ ఆధారిత ఈ-ఓటింగ్‌ యాప్‌ మరింత పదునెక్కించనున్నారు. గతంలో ట్రయల్‌గా ప్రారంభించి, ఖమ్మం జిల్లాలో డమ్మీ పోలింగ్‌ కూడా నిర్వహించారు. ఈ-ఓటింగ్‌ యాప్‌ రూపకల్పనకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), బ్లాక్‌చైన్‌ సాంకేతికతల సాయంతో రాష్ట్ర ఐటీ శాఖ సహకరించింది. తెలంగాణ ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగం సీడాక్‌, ముంబై ఐఐటీ, బిలాయ్‌ ఐఐటీల ప్రొఫెసర్ల సంయుక్త పర్యవేక్షణలో ఈ ఓటింగ్‌ యాప్‌ రూపొందింది. వివిధ ప్రయోగాలు, పరిశీలనల అనంతరం దీనికి తుది రూపునిచ్చారు. దివ్యాంగులు, వృద్ధులు, పోలింగ్‌ సిబ్బంది, ఐటీ ఉద్యోగులు తదితరులు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వారు ఉన్న చోటి నుంచే ఓటు వేసేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఈ-ఓటింగ్‌ విధానం రూపుదిద్దుకుంది. మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు దాని ద్వారా ఓటు వేసేందుకు వీలు కలుగనుంది. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి అనేక భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను సిద్దం చేశారు. కోవిడ్‌ వంటి మహమ్మారి తలెత్తినపుడు లేదా ఇతరత్రా అత్యవసర పరిస్థితులలో అయినా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ-ఓటింగ్‌ విధానం దోహదపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ ఆధారంగా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల దేశంలో ఎక్కడ ఉన్న వారైనా ఎక్కడి నుంచైనా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. సైనికులు, వేర్వేరు ప్రాంతాలలో విధులు నిర్వహించే వారు సహా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ విధానంలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.

ఓటింగ్‌ చాలా సులభం
రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు పోలింగ్‌ రోజున ఈ యాప్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటింగ్‌కు ముందు కూడా రిజిస్ట్రేషన్‌ వివరాలు నమోదు చేయాలి, రిజిస్ట్రేషన్‌ సమయంలో తీసుకున్న ఫొటో ఓటు వేసేందుకు ముందు తీసుకున్న ఫొటోలను సరిపోల్చుకున్నాక బ్యాలెట్‌ పేపర్‌ డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు ఓటు వేయవచ్చు. ఓటు వేసిన వెంటనే ఎవరికి ఓటు వేశారో స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఎక్కడా వ్యక్తుల ప్రమేయం లేకుండా అంతా సాంకేతికతతోనే సాగుతుంది. ఈ ఓట్‌ విధానంలో వచ్చిన ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు.

యాప్‌ పనితీరు ఇలా…
ఇందులో రెండు ప్రక్రియలుంటాయి, మొదటిది రిజిస్ట్రేషన్‌, రెండవది ఓటు వేయడం, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, కృత్రిమమేధ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధను ఉపయోగించినందున అవకతవకలకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో వివరాలు మార్చడానికి వీలుండదు. ఫొటోలను సరిపోల్చడానికి కృత్రిమ మేధ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఫోన్‌ను హ్యాక్‌ చేయడానికి వీలులేని సాంకేతికతను ఈ యాప్‌ రూపకల్పనలో ఉపయోగించారు. ఈ ఓటింగ్‌ విధానంలో ఓటు వేయడానికి ఒక సారి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక పోలింగ్‌ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసేందుకు వీలుండదు.

లైవ్‌ ఫొటోతో నిర్ధారణ అయితేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఓటింగ్‌కు ఒకే ఫోన్‌ నంబర్‌, మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించాలి. ఒకరి బదులుగా మరొకరు ఓటు వేయడానికి వీలు లేని విధంగా సాంకేతికతను ఉపయోగించారు. టీఎస్‌ఈసీ, రాష్ట్ర ఐటీ శాఖ కలిసి ఈ ఓట్‌ యాప్‌ గురించి ఇతర రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు వివరించారు. వివిధ రాష్ట్రాలు దీనిపై ఆసక్తి చూపినట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్రానికి ఐటీ విభాగం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి కూడా రాష్ట్రఐటీ శాఖ దీని గురించి వివరించినట్లు తెలిసింది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *