Breaking News

డీఆర్‌ఐకి చిక్కిన రసాయనశాస్త్ర పరిశోధకుడు

రూ.75 లక్షల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో మరో మాదకద్రవ్యాల తయారీ ముఠా గుట్టురట్టయింది. నిషేధిత మెపెడ్రోన్‌ చేతులు మారుతోందనే సమాచారంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు నిఘా ఉంచగా ఇద్దరు నిందితులు చిక్కారు. ఈ దందా వెనక రసాయనశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందిన వేగి శ్రీనివాసరావు అనే పరిశోధకుడు ఉన్నట్లు తేలింది. అధికారులు అతడితోపాటు సరకు స్వాధీనం చేసుకునేందుకు ముంబయి నుంచి వచ్చిన మరో నిందితుడు అష్రాఫ్‌ను అరెస్ట్‌ చేశారు. వారిద్దరి నుంచి రూ.63.12 లక్షల విలువైన 3.156 కిలోల మెపెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలోని ఓ ప్రయోగశాలలో ఈ మాదకద్రవ్యాన్ని తయారు చేసి మరో ముఠాకు అప్పగిస్తుండగా పట్టుకున్నారు. ప్రయోగశాలపై దాడి చేయగా మరో రూ.12.4 లక్షల విలువైన 112 గ్రాముల మెపెడ్రోన్‌ నమూనాలు, మెపెడ్రోన్‌ తయారీకి వినియోగించే 219.5 కిలోల ముడిపదార్థాలు లభ్యమయ్యాయి. ‘డ్రోన్‌’, ‘మియావ్‌ మియావ్‌’ అనే మారుపేర్లతో పిలిచే ఈ మాదకద్రవ్యం ఎండీఎంఏ, అంపెటమైన్‌, కొకైన్‌ తరహాలో ప్రభావం చూపుతుందని, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు.
ఉద్యోగానికి రాజీనామా చేసి..
అనకాపల్లి ప్రాంతానికి చెందిన వేగి శ్రీనివాసరావు గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ బయోటెక్‌ సంస్థలో బయోకెమిస్ట్‌గా పనిచేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడాదిన్నరగా డ్రగ్స్‌ తయారీ చేస్తున్నాడు. దీనికోసం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ఇంటిలోనే ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు. అక్కడ ప్రతి నెల 10-15 కిలోల మెపెడ్రోన్‌ తయారుచేస్తూ.. కిలోకు రూ.3 లక్షల చొప్పున ముంబయిలోని ముఠాలకు విక్రయిస్తున్నట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది. అక్కడ లభించిన సమాచారం ఆధారంగానే శ్రీనివాసరావును పట్టుకున్నారు. ముంబయి నుంచి సరకు కొనుగోలు చేసేందుకు వచ్చిన అష్రాఫ్‌పై నిఘా ఉంచి వెంబడించడంతో సరకు అందజేస్తూ శ్రీనివాసరావు చిక్కాడు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *