Breaking News

భారత్‌ బంద్‌కు పెరుగుతున్న మద్దతు

పాల్గొననున్న కాంగ్రెస్‌, తెరాస, డీఎంకే, ఆప్‌
ఖేల్‌ రత్న వెనక్కి ఇచ్చేస్తా: విజేందర్‌
ఆందోళన దేశవ్యాప్తం.. పవార్‌ హెచ్చరిక

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. పలు దఫాలుగా కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో రైతు సంఘాలు ఈ నెల 8న భారత్‌ బంద్‌ తలపెట్టాయి. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్‌, తెరాస, డీఎంకే, ఆప్‌ తదితర పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకుంటే తన ఖేల్‌రత్న అవార్డు వెనక్కి ఇచ్చేస్తానంటూ ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ ఇప్పటికే ప్రకటించారు.

దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన 11వ రోజుకు చేరింది. చట్టాల రద్దే లక్ష్యంగా ఆందోళన చేపడుతున్న రైతులు కేంద్రం వినతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించిన రైతన్నలకు రాజకీయ పార్టీల రూపంలో వెన్నుదన్ను లభించింది. దీంతో 8న బంద్‌ చేపట్టేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనకు తాము సంఘీభావం ప్రకటిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. రైతులకు మద్దతు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, రాష్ట్ర రాజధానుల్లో ఆందోళన చేస్తామని ప్రకటించింది. దేశమంతా కొవిడ్‌-19 ఆందోళనలో ఉన్న వేళ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్‌ మిత్రుల కోసం ఆదరాబాదరగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలపెట్టిన బంద్‌కు తెరాస సంపూర్ణ మద్దతు తెలుపుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. తెరాస శ్రేణులు ప్రత్యక్షంగా ఈ బంద్‌లో పాల్గొంటారని ఆయన తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని కేసీఆర్ వారిని సమర్థించారు. ఈ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందు వల్లే తెరాస వాటిని పార్లమెంటులో వ్యతిరేకించిందని సీఎం గుర్తుచేశారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *