Breaking News

మంత్రిపై దాడికి పాల్పడిన నిందితుడుకి 14 రోజుల రిమాండ్‌

తెలుగు తేజం, మచిలీపట్నం : రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖా మంత్రి పేర్ని నానిపై దాడికి పాల్పడిన నిందితుడు బడుగు నాగేశ్వరరావుపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నెంబరు 126/2020యూ/ఎస్‌307 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్‌ విధించారు. అయితే ఈ కేసులో విచారణ ఇంకా పూర్తికాలేదని, పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు మెమో ఫైల్‌ చేశారు. కోర్టు అనుమతితో నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారిస్తామని మచిలీపట్టణం డీఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.
నిర్మాణ కార్మికుడు బడుగు నాగేశ్వరరావు దాడికి పాల్పడటం వెనుక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేకపోవడంతో నాగేశ్వరరావు మంత్రిపై దాడికి పాల్పడ్డాడా? లేక మరేదైనా బలమైన కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిపై దాడి చేయించింది టీడీపీ నాయకులేనని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండగా, టీడీపీ నాయకులు అధికార పార్టీ నాయకులే సానుభూతి కోసం దాడి చేయించుకుని ఉంటారని ఎదురుదాడికి దిగుతున్నారు. కాగా ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌లో పలు దఫాలుగా విచారణ చేశారు. నిందితుడి సోదరి బడుగు ఉమాదేవికి, మంత్రి ముఖ్య అనుచరుల్లో ఒకరికి ఉన్న పరిచయం పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. దీంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు, అతని సోదరి ఫోన్‌ సంభాషణలకు సంబంధించిన కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *