న్యూఢిల్లీ:వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది.
ఓవైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి.
పెంచిన ధరలు శనివారమే అమల్లోకి వచ్చాయి.
దీంతో దిల్లీలో సిలిండర్ ధర రూ.999.50కి చేరింది.
హైదరాబాద్లో 14 కేజీల సిలిండర్ ధర రూ.1052కి చేరింది.
వాణిజ్య సిలిండర్
కొద్ది రోజుల క్రితమే వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి చమురు సంస్థలు.
మే 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.102.50 పెంచటం వల్ల దిల్లీలో రూ.2253గా ఉన్న గ్యాస్ బండ రూ.2355.50కి చేరింది.