Breaking News

ఏపీలో అనధికార, అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేత

తెలుగు తేజం, అమరావతి : రాష్ట్రంలో ఇకపై ఇటువంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చెక్‌ పెట్టింది. సామాన్యులు మోసపోకుండా చూసేందుకు చర్యలు తీసుకోనుంది అనధికార, అక్రమ లే అవుట్లపై పురపాలకశాఖ కొరఢా ఝుళిపించింది. వీటి రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసింది. అనధికార, అక్రమ లే అవుట్ల వివరాలను అన్ని జిల్లాల్లో రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపింది. ఆ లే అవుట్లల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని కోరింది. ప్రజలు మోసపోకుండా ముందే పరిశీలించుకునేందుకు వీలుగా ఈ జాబితాలను పట్టణ, వార్డు సచివాలయాల్లోను, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని పంచాయతీల్లోను అందుబాటులో ఉంచింది. దీంతో సామాన్యులకు ఊరట లభించింది. రాష్ట్రంలో అనధికార, అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేయడం ఇదే తొలిసారి.
6,076 లే అవుట్లు.. 34,167 ఎకరాలు
పురపాలకశాఖ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,076 అనధికార లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. మొత్తం 34,167 ఎకరాల్లో ఈ లే అవుట్లు వేశారు. వాటిలో నిబంధనల మేరకు రోడ్లు, పార్కులకు భూమి కేటాయించకపోవడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినవి, ప్రైవేటు వివాదాల్లో ఉన్న భూములు మొదలైనవి ఉన్నాయి. ఆ అంశాలను పట్టించుకోకుండా లే అవుట్లు వేసి సామాన్యులకు విక్రయించాలని కొందరు రియల్టర్లు భావించారు. నిబంధనల ప్రకారం వాటికి అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు వేసి విక్రయాలకు సిద్ధమయ్యారు. ముందు అమ్మి సొమ్ముచేసుకుంటే తరువాత ఎప్పుడో క్రమబద్ధీకరించుకోవచ్చని ఎత్తుగడ వేశారు. దీన్ని గమనించిన పురపాలకశాఖ ఆ లే అవుట్లను బ్లాక్‌ లిస్టులో పెట్టింది. వాటిని రిజిస్ట్రేషన్‌ చేయొద్దని రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు జాబితా కూడా సమర్పించింది. అనధికార లే అవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆ ప్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు ఇబ్బందులు పడకుండా పురపాలక శాఖ అడ్డుకోగలిగింది. నిబంధనలను పాటిస్తేనే భవిష్యత్‌లో వాటికి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తారు.

సామాన్యులు మోసపోకూడదనే అనధికార, అక్రమ లే అవుట్లలో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు మోసపోతున్నారు. దీన్ని అడ్డుకునేందుకే ఇటువంటి లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయించాం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఈ కార్యాచరణ చేపట్టామని పురపాలకశాఖ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం డైరెక్టర్, వి.రాముడు తెలిపారు .

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *