Breaking News

కొత్త జిల్లాలకు ముమ్మర కసరత్తు..

శాఖల వారీగా ఆస్తులు, భూములు, భవనాల గుర్తింపు

పనిచేసే ప్రాంతాల ప్రాతిపదికన ఉద్యోగుల గణన

నేడు పునర్విభజన వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌

జేసీలు, డీఆర్‌ఓల నేతృత్వంలో జిల్లా స్థాయిలో సబ్‌ కమిటీలు

కొత్త జిల్లాలకు ముమ్మర కసరత్తు చేస్తున్న యంత్రాంగం

తెలుగు తేజం , మచిలీపట్నం: పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ఇదీ జిల్లాలో పరిస్థితి. జిల్లా పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. కాగా జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్నాయి. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నగరంలోని ఈస్ట్, వెస్ట్, సెంట్రల్‌లతో పాటు మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మచిలీపట్నంతో పాటు గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలున్నాయి. కొత్త జిల్లాల దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఏలూరు పార్లమెంటు జిల్లాలో కలపనున్నారు. బందరు డివిజన్‌ మినహా మిగిలిన డివిజన్లలో ఒకే నియోజకవర్గానికి చెందిన మండలాలు రెండు మూడు కలిసి ఉన్నాయి. వాటిని పార్లమెంటు జిల్లాలకు అనుగుణంగా కలపాల్సి ఉంది. జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 45.17 లక్షలుంటే ప్రస్తుతం ప్రొజెక్టడ్‌ జనాభా 50లక్షలు దాటింది. కాగా ఏలూరులో కలవనున్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల పరిధిలో 5.63లక్షల జనాభా ఉండగా, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 20.65 లక్షలు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 18.89 లక్షల జనాభా ఉన్నారు.

నాలుగు సబ్‌ కమిటీలు..
జిల్లా స్థాయిలో ఏర్పాటైన పునర్విభజన కమిటీ జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ నేతృత్వంలో రాష్ట్రంలోనే తొలి భేటీ మన జిల్లాలోనే జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు జిల్లా స్థాయిలో జేసీలు, డీఆర్‌ఓలతో ఆధ్వర్యంలో ఆరు నుంచి పది మంది జిల్లా అధికారులతో నాలుగు సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల సరిహద్దులు క్రోడీకరిస్తున్నారు.

వివరాల సేకరణ
తాజాగా ప్రభుత్వాదేశాలతో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆస్తులు, భూముల వివరాలను సేకరిస్తున్నారు. శాఖల వారీగా ఏర్పాటు చేయాల్సిన కార్యాలయాలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాలు ఏ మేరకు సరిపోతాయో అంచనా వేస్తున్నారు. శాఖలవారీగా భవనాలు, ఆస్తులు, భూములకు సంబంధించిన సేకరించిన వివరాలను నేడు ‘డీఆర్‌పీ.ఏపీ.జీఓవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. మరోవైపు శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను గణించే ప్రక్రియ సాగుతోంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *