Breaking News

స్టాలిన్‌ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ నివాసంలో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నీలంగరాయ్‌లోని శబరీశన్‌ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మరో మూడు కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి. స్టాలిన్‌ కుమార్తె సెంతమరయ్‌ భర్త శబరీశన్‌.

శాసనసభ ఎన్నికలకు ముందు డీఎంకే నేతలపై ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి. గత నెల ఆ పార్టీ సీనియర్‌ నేత ఈవీ వేలు నివాసంలో ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం భారీగా నగదు ప్రవాహం జరగుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

తమిళనాడులో మొత్తం 234 శాసనసభ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 6న ఓకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 2011 నుంచి అధికారానికి దూరంగా ఉంటోన్న డీఎంకే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌, వాపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని గట్టిగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే 173 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. స్టాలిన్‌ ఎప్పటిలాగే కొలతూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌ నుంచి ప్రత్యక్ష ఎన్నికల పోరులోకి అరంగేట్రం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *